Jagathguru Bhodalu Vol-9        Chapters        Last Page

వ్యవసాయాత్మికబుద్ధి

సంగ్రామరంగంలో విజయలక్ష్మిగా దర్శనమిచ్చే భగవతి కామాక్షి అనంత దయామృతాన్ని, అనందామృతాన్ని మనపై వరించుగాక. ఆ కామకోటి, సర్మకామ్యములకూ అవధి జగజ్జనని, పరమశివుని అర్ధాంగి. పరబ్రహ్మ విద్యాస్వరూపిణి, పరాశక్తి, విజయలక్ష్మియై కంటికి రెప్పవలె మనలను రక్షించుగాక. అనహంకారము, ఏకలక్ష్యోన్ముఖమైన కార్యదీక్ష, త్యాగబుద్ధి, శతృవుపట్లకూడ ద్వేషరాహిత్యము, విశ్వకల్యాణకాంక్ష, ఏకైక నాయకత్వము, సత్యసంధత, పరస్త్రీల ఎడ సోదరభావం - అనెడు ఎనిమిది కల్యాణ కామ్య భరితమైన పూర్ణకుంభమును, భక్తిరరసామృతములతో నింపి ఆ విజయలక్ష్మికి స్వాగత మిచ్చెదముగాక.

సామవేదీయ కేనోపనిషత్తులో. ఆ పరదేవత హైమవతిగ, ఉమగ వర్ణింపబడినది. అకార, ఉకార, మకారత్మకమైన ప్రణవస్వరూపిణియే ఉమ. ఆమెయే బ్రహ్మవిద్య. దేవాసుర సంగ్రామ సమయమున, విజయగర్వోన్మత్తులైన దేవతలకు దర్శనమిచ్చి. వారి అహంకారమును నిర్మూలించు అనుగ్రహించిన మూర్తియు ఆమెయే అహంకార రాహిత్యముకొరకు, మనమును ఆమెనే ప్రార్థింతుము గాక.

( 9 - 8 )

యస్య నాహం కృతో భావం బుద్ధి ర్యస్య న లిప్యతే

హత్వావపి ఇమాం లోకాన్‌ నాయంహంతి న హస్యతే!

అని గీత చెబుతున్నది. భావములోనూ బుద్ధిలోనూ అహంకారము లేని వాడు ఈ లోకాలనంతటినీ పరిమార్చినా చంపుట చచ్చుట అనే విషయములచే బాధితుడు కాడని అర్ధము. సంగ్రామము మనఎల్లలకు వచ్చిన ఈ విపత్కరసమయములో మనకర్తవ్యమేమి?

'ఆపది కిం కరణీయం? స్మరణీయం చరణయుగళ మంబాయాః' అనునదే మనకు ప్రామాణిక వచనము ఆ పరాశక్తియే భారతదేశంలో మహారాష్ట్రంలో తులజాభవానిగాను కాశ్మీరములో క్షీరభవానిగాను, పంజాబులో జ్వాలాముఖిగాను, గుజరాతులో అంబాజీగాను, ఉత్తరప్రదేశంలో వింధ్యవాసినిగాను, బంగాళములో కాళిగాను, కామరూపంలో కామాఖ్యగాను, కర్నాటకంలో చాముండిగాను కంచిలో కామాక్షిగాను, దక్షిణాగ్రంలో కన్యాకుమారిగాను, శతాధిక రూపములతో ఆయా ప్రదేశములలో వెలసి అవ్యాజప్రేమాతిశయములతో అప్రమత్తతతో కాపాడుతున్నది.

ఈనాడు మాతృభూమి సంరక్షణలో ఒక ముఖ్య కర్తవ్యముగా స్వర్ణదాన ప్రసక్తి వినబడుతున్నది. జన్మభూమిని రక్షించు కొనుటకుగాను ప్రతిఒక్కరూ ఒక్క గురిగుంజ ప్రమాణం గల బంగారు పుష్పమును తమ గ్రామములలో వెలసియుండు పరాశక్తి హైమపతి చరణకమలములపై సమర్పించిన, ఆ విజయలక్ష్మి మన దేశమున అవతరించి తీరుతుంది. ఈ స్వర్ణ పూజ ప్రతిభారతీయునికి కర్తవ్యము.

శత్రువుపట్ల మిత్రభావం కలగటం, కామాక్షీకటాక్షవీక్షణా ఫలితం. ఆ తల్లి కృపాదృష్టికి భాజనుడైన వానికి పరనారీ సహోదరదృష్టి సహజంగా లభిస్తుంది.

శివ శివ పశ్యంతి సమం శ్రీ కామాక్షీ కటాక్షితాః పురుషః!

విపినం భవనం, అమిత్రం మిత్రం లోష్టంచ యువతి బింబోష్ఠం||

ఆ తల్లి కటాక్షానికి పాత్రులైనవారు, అరణ్యాన్నీ అంతఃపురాన్నీ, శత్రువులనూ, మిత్రులనూ, యువతి బింబాధరాన్నీ, ఇనుప ముక్కనూ, ఒక్కటిగా సమదృష్టితో చూడగలరు. అమార్గగామియైన శత్రువు దండనీయుడే. కానీ యుద్ధముచేయునపుడు మన హృదయములలో అహంభావమూ, ద్వేషమూ వుండరాదు. ధర్మబుద్ధిగల రాజు, న్యాయదృష్టి కల న్యాయాధీశుడు, అపరాధులైన మిత్రులనూ, శత్రువులనూ ద్వేషబుద్ధిలేక, మైత్రీ పరిత్యాగంలేక ఏ విధంగా దండిస్తారో, అదేవిధంగా యుద్ధసమయంలో మనం శత్రువులను దండించినా మైత్రీ పరిత్యాగం ఉండరాదు మనకిలాంటి సమత్వము. అనహంకారత అనుగ్రహించ వలసినదని పరదేవతను ప్రార్థిస్తూ మరొక పర్యాయం గీతావాక్యం స్మరిద్దాం.

యస్య నాహం కృతో భావః బుద్ధి ర్యస్య న లివ్యతే!

హత్వాపి స ఇమాం లోకాన్‌ నాయంహంతి న హస్యతే!

మనబుద్ధి సర్వదా ధర్మలగ్నమై యుండవలెనని పరమేశ్వరిని ప్రార్థించుదము. ఇతరులకూ అలాంటి ధర్మనిష్ఠ ప్రసాదించవలసినదని అర్ధించుదము. ఈ విపత్కర పరిస్థితిలో రాజనీతిజ్ఞులకు ఒక హెచ్చరిక. వారివారికి తోచే సత్పరామర్శలు, సలహాలు, ప్రభుత్వానికి ఎంతైనా అవసరం. ఆ సలహాలనూ, రాజనీతిని, నేరుగా రాష్ట్రనిర్వాహకులైన మంత్రులతో నివేదించడము మంచిదికానీ, బహిరంగముగా సభావేదికలమీద మంత్రాలోచన చేయడం తగదు. అది దేశభద్రతకు అడ్డు వచ్చేపరిస్థితిని తెచ్చి పెట్టగలదు.

యుద్ధములో విజయము కలుగునంతవరకు, రాష్ట్ర నిర్వాహకులైన మంత్రులకు మైత్రీ పురస్సరములైన సలహాలను ఇవ్వవలసినదే నేటి పరిస్థితిలో నలువది కోట్ల భారతీయులు ఏక లక్ష్యముతో, ఏక నిశ్చయముతో కృష్ణపరమాత్మ గీతలో చెప్పినరీతి, వ్యవసాయత్మిక బుద్ధిపై భావముతో పనిచేయదురుగాక, మన అందరి హృదయములలో ఈశ్వరభక్తి విలసిల్లుగాక, మన దేశసంరక్షణకు యోధుల హస్తములలో అమోఘమయిన శస్త్రములు వెలుగొందుగాక! లక్ష్మీ విజయము మనకు లభించుగాక, ''శ్రీరస్తు, విజయోస్తు; ధ్రువానీతిరస్తు.'

యత్ర యోగేశ్వరః కృష్ణః యత్ర పార్థో ధనుర్ధరః !

తత్ర శ్రీః విజయంః భూతిః ధ్రువానీతి ర్మతి ర్మమ||

పరమధార్మికమైన ఈ భారత బృందావనంలో ఏకైక ప్రతిసామరస్యంకలిగి వివిధ నీతి స్వర విశేషాలను వెలార్చే అద్భుత వేణునాద కూజితమైన సుమలతా కుంజసీమలను అతిక్రమించ కుండుదుము గాక.

(ఆకాశవాణిలో శ్రీ స్వామివారి ఉపాన్యాసం)


Jagathguru Bhodalu Vol-9        Chapters        Last Page